అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం
భర్త వేధింపులపై ఫిర్యాదు
మీకోసంలో జిల్లా ఎస్పీ
కోనేరుసెంటర్: న్యాయం కోసం మీ కోసంను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సమస్య తీవ్రను బట్టి విచారణ జరిపించి చట్టపరిధిలో న్యాయం చేస్తామన్నారు.
పోరంకి నుంచి వచ్చిన ఓ వివాహిత కొన్ని కారణాల వలన మొదటి భర్తతో విడాకులు తీసుకుని పెనమలూరుకు చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవటం జరిగిందని చెప్పింది. అయితే తాను అధిక కట్నం కావాలని మానసికంగా తీవ్ర వేధింపులకు పాల్పడటంతో పాటు శారీరకంగా దాడి చేస్తూ హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. వీటితో పాటు వచ్చిన అర్జీలపై స్పందించిన ఎస్పీ సమగ్ర విచారణ జరిపించి కచ్చితంగా న్యాయం చేస్తామని బాఽధితులకు హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ వీవీ నాయుడు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.


