జయహో దుర్గాభవాని | - | Sakshi
Sakshi News home page

జయహో దుర్గాభవాని

Dec 16 2025 4:41 AM | Updated on Dec 16 2025 4:41 AM

జయహో

జయహో దుర్గాభవాని

సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు

యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అర్చకులు ఐదు రోజుల్లో 5.27లక్షల మంది దీక్ష విరమణ రేపటి నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు

సమష్టి కృషితో విజయవంతం..

సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. మొత్తం 5.27లక్షల మంది భవానీలు దీక్షలను విరమించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రికి నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరిప్రదక్షిణను పూర్తి చేసుకున్నారు. అర్ధరాత్రి క్యూలైన్‌లోకి చేరుకున్న భవానీలు, భక్తులకు గంటన్నర లోపే అమ్మవారి దర్శనం పూర్తయింది. కొండ దిగువకు చేరుకున్న భవానీలు ఇరుముడులు, హోమగుండానికి నేతి కొబ్బరి కాయలను సమర్పించిన దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భవానీలకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో భవానీల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో గిరిప్రదక్షిణకు నాలుగున్నర నుంచి 5 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గిరిప్రదక్షిణ మార్గంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి పరిసరాలు, కెనాల్‌రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.

రేపటి నుంచి ఆర్జిత సేవలు..

మంగళవారం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని, మంగళవారం కూడా వచ్చే భవానీలకు అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. దీక్షలు ముగియడంతో బుధవారం నుంచి ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొనవచ్చని, టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు.

మహా పూర్ణాహుతితో పరిసమాప్తం..

మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్‌.దుర్గాప్రసాద్‌, ఇతర వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌, భవానీ దీక్ష విరమణల ఫెస్టివల్‌ ఆఫీసర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల సహకారం, సమష్టి కృషితోనే దీక్ష విరమణలను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఈ ఏడాది దీక్ష విరమణలు చేసిన భవానీల సంఖ్య పెరిగిందని, మొత్తంగా 5.27 లక్షల మంది రాగా, 21.25లక్షల లడ్డూలను విక్రయించారన్నారు. అన్న ప్రసాదం, అల్పాహారాన్ని 2.13 లక్షల మందికి అందించామని, సుమారు 60వేల మంది భవానీలు అమ్మవారికి తలనీలాలు సమర్పించారని చెప్పారు.

పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు

జయహో దుర్గాభవాని 1
1/1

జయహో దుర్గాభవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement