నేటి నుంచి కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో ఈనెల 12 నుంచి 14 వ వరకు మూడు రోజులు పాటు నాట్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం విశ్రాంత ప్రధాన ఆచార్యులు, కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గురువారం తెలిపారు. నాట్యాచార్యులు చక్రవర్తులు పవన్ కుమార్, నిహారిక చౌదరిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయకారులు (కేరళ) సంగీత సామ్రాజ్య సంచారిణి అంశం పై శిక్షణ, కూచిపూడి నాట్య చరిత్ర, పరిక్రమణ సిద్ధాంతం పై అవగాహన తరగతులు ఉంటాయని చెప్పారు. డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానితో సంగీతం, తాళాలుపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 50 మంది పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు.
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఏపీ టెట్ 2025 పరీక్షలు రెండు సెషన్లలో గురువారం ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో మొత్తం1,923 మంది అభ్యర్థులు కేటాయించగా, 1,784 మంది హాజరయ్యారన్నారు. 139 మంది గైర్హాజరయ్యారన్నారు. రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షల సగటు విద్యార్థుల హాజరు 93.48 శాతంగా ఉందని చెప్పారు.
ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీ వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు గురువారం లభ్యమైంది. నదిలో కనిపించిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని భావించారు. మృతదేహం నీటిలో ఉబ్బిపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. పంచనామా నిర్వహించిన అనంతరం విజయవాడ మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సతీష్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సివిల్ సప్‌లైస్ జిల్లా మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 148 రైతు సేవా కేంద్రాలను ఎంపిక చేశామని, వీటిలో 136 ఆర్‌ఎస్‌కేలు పనిచేస్తున్నాయని చెప్పారు. తిరువూరు డివిజన్ 53, నందిగామ డివిజన్ 46, విజయవాడ డివిజన్ 37 రైతు సేవా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. 18.75 లక్షల గోనె సంచులు అవసరమని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 23,21,400 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. తిరువూరు డివిజన్ 12,23,950, విజయవాడ డివిజన్ 5,84,200, నందిగామ డివిజన్ 5,13,250 కేటాయించడం జరిగిందన్నారు. ఈ సీజన్‌లో 9693 మంది రైతుల నుంచి 70,156 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు రూ.146.10 కోట్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ధాన్యం రవాణాకు 1599 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.


