మద్యం మత్తులోనే నవీన్‌రెడ్డి హత్య
నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపర్చిన డీసీపీ లక్ష్మీనారాయణ
జగ్గయ్యపేట: మండలంలోని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల నాలుగో తేదీన ధర్మవరప్పాడు తండా రామ్‌కో ఫ్యాక్టరీ సమీపంలో విజయవాడకు చెందిన ఆలవాల నవీన్‌రెడ్డి హత్య మద్యం మత్తులో జరిగిందని డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. నిందితుడు విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిల్లా సాయిని పట్టణంలోని సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల ఎదుట హాజరుపర్చి కేసు వివరాలను తెలిపారు. మృతుడు నవీన్‌రెడ్డికి నిందితుడు గాదె సాయికృష్ణ విజయ వాడలో ఓ జైలులో పరిచయం. ఈ క్రమంలో ఈ నెల నాలుగో తేదీన చిల్లకల్లు గ్రామానికి చెందిన ఇనపనూరి అన్వేష్ మద్యం పార్టీ ఇవ్వటంతో ఆ పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. మద్యం మత్తులో నవీన్‌రెడ్డి, సాయికృష్ణల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సాయికృష్ణ బీరు సీసా పగలగొట్టి నవీన్‌రెడ్డిపై దాడి చేయగా నవీన్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడున్న అన్వేష్ , మరొకరి సాయంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం 10 బృందాలతో గాలింపు చేపట్టామని, సోమవారం ఉదయం జగ్గయ్యపేటలో అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు డీసీపీ తెలిపారు. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు తోట సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ, శంకర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడు సాయికృష్ణపై పలు కేసులు
సాయికృష్ణపై భవానీపురం, ఇబ్రహీంపట్నం, కృష్ణలంకతో పాటు పలు పోలీస్‌స్టేషన్లలో గంజాయి, పోక్సో కేసులతో పాటు పదిహేనుకు పైగా కేసులు ఉన్నాయి. నవీన్‌రెడ్డి, సాయికృష్ణ చిల్లకల్లులో కొంతకాలంగా ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయికృష్ణను సాంకేతిక పరిజ్ఞానంతో చిల్లకల్లు పోలీసులు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.


