ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో పంచాయతీల ఈఓలకు అందజేశారు. ఆత్కూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సుపరిపాలన అందించడంలో, కేసరపల్లి గ్రామ కాఫీ షాప్ ద్వారా సొంతంగా రెవెన్యూ సాధించడంలో, బాపులపాడు పంచాయతీ స్వచ్ఛరథం నిర్వహణలో, పునాదిపాడు పంచాయతీ సంపద తయారీలో, చల్లపల్లి స్వచ్ఛ సుందరంగా, నాగాయలంక ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య యూనిట్ నిర్వహణలో ఆదర్శంగా నిలిచారన్నారు. ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాలు పొందడంలో విశేష కృషి చేసిన డీపీవో జె.అరుణ, పంచాయతీ ఈవోలను కలెక్టర్ అభినందించి మరింత సుపరిపాలన అందించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, డీఎల్‌పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు.


