వైద్యశాఖలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించండి
ప్రభుత్వానికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యశాఖలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.గిరిబాబు అన్నారు. ఆస్పత్రుల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జీఓ ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పీహెచ్‌సీలు 24/7 ఆస్పత్రులుగా ఉన్నందున, వాటిలో అదనంగా మరో స్టాఫ్‌నర్సును నియమించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, వీక్లీ ఆఫ్, సెలవుల్లో సర్దుబాటు కావడం లేదని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు లాస్ట్ గ్రేడ్ వర్కర్లు ఉండేలా చూడాలని కోరారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజీ సర్వీసు సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. కాల్ డ్యూటీ పేరుతో ఉన్న వారినే 24 గంటలు డ్యూటీ చేయమనడం సరికాదన్నారు. సెకండరీ హెల్త్ విభాగంలో ఉద్యోగుల సెలవులు మంజూరుకు పెట్టిన ఐదు శాతం నిబంధన తీసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు పోస్టులు భర్తీ చేయాలని, శాఖాపరమైన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. పెరిగిన ఆస్పత్రులకు అనుగుణంగా వైద్యులు, పారామెడికల్, నర్సింగ్, క్లాస్‌ఫోర్ సిబ్బంది నియామకాలు చేపడితేనే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ ఫైలింగ్‌లో కాలపరిమితి పెట్టాలని గిరిబాబు డిమాండ్ చేశారు.
ప్రాణాలు కాపాడిన పోలీసులు
పటమట(విజయవాడతూర్పు): జాతీయ రహదారి 16పై రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ మీదగా స్క్యూబ్రిడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాల మేరకు సోమవారం రాత్రి బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ దిగే సమయంలో రామవరప్పాడు వైపు నుంచి స్క్యూబ్రిడ్జికి వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు లారీ కింద చిక్కుకున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే 5వ ట్రాఫిక్ సీఐ రవికుమార్‌కు వైర్లెస్ సెట్లో సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడు కారు వెనుక లారీకింద చిక్కుకున్నాడు. వెంటనే క్షతగాత్రుడిని బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యమవుతుందని క్షతగాత్రుడిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


