స్క్యూబ్రిడ్జి వద్ద భవానీల ఆందోళన
మాపై దాడి చేశారంటున్న మాలధారులు ప్రమాదకర ప్రయాణం వద్దన్నందుకు కానిస్టేబుల్ ఫోన్ పగలగొట్టారంటున్న పోలీసులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ స్క్యూబ్రిడ్జి వద్ద స్వల్ప విషయమై భవానీ మాలధారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో భవానీలు సుమారు గంటపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఏసీపీలు దామోదర్, పావన్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది వారిని కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే...
కంకిపాడుకు చెందిన సుమారు 25 మంది భవానీ మాలధారులు రెండు ఆటోల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం మధ్యాహ్నం సద్దికి బయలు దేరారు. ఆటో వెనుక డోర్‌పై కూడా కూర్చుని ప్రయాణిస్తున్న భవానీ మాలధారులను కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద కానిస్టేబుల్ చూసి వారిని ఆపారు. సురక్షితం కాని ఇలాంటి ప్రయాణం చేయవద్దని మందలించారు. దీంతో భవానీ మాలధారులకు, కానిస్టేబుల్‌కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ తరుణంలో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని భవానీ మాలధారుల్లో ఒకరు పగలకొట్టినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బెంజిసర్కిల్ వద్ద ఆపిన పోలీసులు
ఆటోల్లో వస్తున్న భవానీ మాలధారులను బెంజిసర్కిల్ వద్ద పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారని భవానీ మాలధారులు గొడవ పడుతుంటే , ట్రాఫిక్ ప్రాంతం కావడంతో వదిలేశారు. అనంతరం స్క్యూబ్రిడ్జి వద్ద రెండు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు ఆపారు.
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
ట్రాఫిక్ పోలీసులు తమ ఆటోలను ఆపడంతో భవానీ మాలధారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గంటపాటు ఆందోళన సాగడంతో ఏసీపీలు దామోదర్, పావన్‌కుమార్ అక్కడకు చేరుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా తొలుత వినలేదు. అనంతరం వారందరినీ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు రమ్మని తీసుకెళ్లారు. అయితే వారు ఫిర్యాదు చేయకుండానే స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. గంటపాటు చేసిన ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కృష్ణలంక, పటమట, ట్రాఫిక్ సీఐలు నాగరాజు, పవన్‌కిషోర్, రామారావు, బాలమురళీకృష్ణ చర్యలు తీసుకున్నారు.


