ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
నందిగామ టౌన్: చెడు వ్యసనాలకు బానిసై ఖరీదైన మోటారు సైకిళ్లను అపహరించి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సోమవారం ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి చోరీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరి గ్రామానికి చెందిన ఏపురి శివ, నకిరేకల్ మండలం చీమలగడ్డ గ్రామానికి చెందిన కుర్రి మహేంద్ర, మేడిపల్లి ఉమేష్‌చంద్ర, నకిరేకల్‌కు చెందిన కంచుకొమ్మల సంజయ్ కుమార్, నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఊదర సంతోష్ గత కొంత కాలంగా ఖరీదైన ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తాకట్టు పెడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నందిగామ శివారు వై జంక్షన్ వద్ద ఎస్‌ఐలు మోహనరావు, సూర్యవంశీ వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఐదుగురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పిడుగురాళ్ల ఒకటి, నరసరావుపేట ఒకటి, పెనమలూరు ఒకటి, కృష్ణలంక ఒకటి, రెంటచింతల ఒకటితో పాటు ఆయా ప్రాంతాలలో చోరీకి పాల్పడిన మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐలను అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో ఏసీపీ తిలక్, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం


