కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

Dec 9 2025 10:46 AM | Updated on Dec 9 2025 10:46 AM

కృష్ణ

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

కృష్ణలంక(విజయవాడతూర్పు): సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యనమలకుదురు, అవనిగడ్డ కరకట్ట రోడ్డులోని హోసన్నా మందిర్‌ సమీపంలో నివాసం ఉంటున్న పి.కిషోర్‌ కంచికచర్లలోని మిక్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన యూనికార్న్‌ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. కృష్ణలంక, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో హైవే మీదకు చేరుకోగానే ద్విచక్ర వాహనం ఇంజిన్‌లో లోపాలు తలెత్తి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన కిషోర్‌ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. అప్పటికే యువకుని కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి

పామర్రు: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన సంఘటన పామర్రులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు పంచాయతీ పరిధిలోని చెన్నువానిపురానికి చెందిన చిన్నం విజయ్‌బాబు(51) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం బలిపర్రులో ఓ ఇంటి కరెంట్‌ వైరింగ్‌ పనులు చేస్తూ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కగా, విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురై కిందకు పడిపోయాడు. చెవుల నుంచి రక్తం కారుతుండగా అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాడు. విజయ్‌ మృతితో చెన్నువానిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్‌బాబు భౌతిక కాయాన్ని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దార్శనికత, జ్ఞానం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా కొనియాడారు. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో రాజ్యాంగ విలువలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు పీఈ ఎడ్విన్‌, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఖోఖో సంఘం రాష్ట్ర

అధ్యక్షుడిగా మడకా ప్రసాద్‌

గుడివాడరూరల్‌: ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన మడకా ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఏలూరులో జరిగిన రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా మడకా ప్రసాద్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేడియం కమిటీ వైస్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రటరీ రంగప్రసాద్‌, గౌతమ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కె.అవినాష్‌, ఖోఖో సంఘం జిల్లా సెక్రటరీ మద్దినేని సత్యప్రసాద్‌ అభినందించారు.

కొమ్మా కోటేశ్వరరావుకు

15 వరకు రిమాండ్‌

రామవరప్పాడు(విజయవాడ రూరల్‌): గన్న వరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్‌ చేసి దాడి చేశారంటూ టీడీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో కొమ్మా కోటేశ్వరరావు(కొమ్మా కోట్లు)కు ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోగా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం 1
1/2

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం 2
2/2

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement