ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలు పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బిడ్డల ఆదరణ నోచుకోని అభాగ్యులు ఇలా ఎందరో మీకోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తేగా, చలించిన ఆయన వీలైనంత త్వరగా మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ రోజు ప్రధానమైన అర్జీలు
● పెనమలూరు నుంచి కవిత అనే బాధితురాలు ఎస్పీని కలిసి తన భర్త అదనపు కట్నం కోసం గత రెండేళ్లుగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని, పెద్దలలో పెట్టినా అతని ప్రవర్తనలో మార్పు రావటం లేదని తన సమస్యకు పరిష్కారం చూపి న్యాయం జరిగేలా చూడాలని కోరింది.
● పెడన నుంచి నరసమ్మ అనే వృద్ధురాలు తన కన్నబిడ్డలు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతున్నారని, పైగా ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. వారి నుంచి రక్షణ కల్పించి బిడ్డలు తనకు అన్నం పెట్టేలా చూడాలని కోరింది.
● తోట్లవల్లూరుకు చెందిన వీరయ్య తన ఇంటి సరిహద్దుదారులు తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడుతూ బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు.
● అవనిగడ్డ నుంచి వనజ అనే వివాహిత తనకు తన భర్తకు మధ్య విభేదాలు తలెత్తటంతో అత్తింటి వారు తన మూడేళ్ల బిడ్డను తనకు చూపించకుండా వారి వద్దే ఉంచుకున్నారని, బిడ్డను తనకు అప్పగించి న్యాయం చేయాలని కోరింది.
మీకోసంలో జిల్లా ఎస్పీ
విద్యాసాగర్‌నాయుడు


