ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కొత్త డీఈఓల నియామకం
మచిలీపట్నంఅర్బన్/వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు నూతన డీఈఓలు నియమితులయ్యారు. కృష్ణా జిల్లాకు యు.వి.సుబ్బారావును విద్యాశాఖ నియమించింది. ఆయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన బందరు ఉప విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన పి.వి.జె.రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారిగా ఎల్.చంద్రకళ నియమితులయ్యారు. ఆమె పల్నాడు జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. చంద్రకళ గతంలో ఉపవిద్యాశాఖాధికారిగా పని చేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లోని 16 బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ మంగళ వారం జువైనెల్ జస్టిస్ రూల్స్ ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 16,17 తేదీల్లో అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు, వైద్య శిబిరాల నిర్వహణ, ఆధార్ లేని బాలలకు ఆధార్ కల్పించటం, బాలలను స్కూల్లో చేర్పించడం వంటి తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కేంద్రాలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు జ్యోతి, డాక్టర్లు మాధవి, రాఘవరావు, ఫ్రాన్సిస్ తంబీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ కార్యనిర్వహణాధికారి అరుణ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీపావని, ఈఓ ఆకుల కొండల రావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీల కానుకలను లెక్కించారు. 45 రోజులకు రూ.16,58,075 నగదు, 920 మిల్లీ గ్రాముల బంగారం, 125 గ్రాములు వెండి వచ్చిందని ఈఓ కొండలరావు తెలిపారు. దేవస్థాన సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు సేవా సమితి బాధ్యులు, వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని వైద్య సిబ్బందికి సూచించారు. నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లకు మంగళవారం పల్స్‌పోలియోపై శిక్షణ ఇచ్చారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. ఈ నెల 21న బూత్ యాక్టివిటీలో ఐదేళ్ల వయస్సుగల పిల్లలందరికీ రెండు చుక్కల పోలియో చుక్కలు వేయాలన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శరత్‌బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కొత్త డీఈఓల నియామకం


