ప్రజారోగ్యం.. గాల్లో దీపం!
మాంసం దుకాణాలు, ఆర్వో ప్లాంట్లపై పర్యవేక్షణ శూన్యం
విజయవాడలో తరచూ ప్రబలుతున్న అంటువ్యాధులు డివిజన్లలో తనిఖీలు శూన్యం విచ్చలవిడిగా నిల్వ మాంసం విక్రయాలు సిబ్బంది ధ్యాసంతా వసూళ్ల పైనే చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
తనిఖీలు చేస్తున్నాం..
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఆహార తనిఖీలు చేయాల్సిన ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతుండగా, నాణ్యాతా ప్రమాణాలు పాటించని ఆర్‌ఓ ప్లాంట్ల నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తరచూ ప్రజలు అంటువ్యాధులు బారిన పడుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. ప్రజారోగ్యశాఖ అంటే కేవలం నగరంలో శానిటేషన్ పనులకే పరిమితమైనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అనారోగ్యాలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేయరా..
నగరంలో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అంతేకాదు మటన్‌షాపుల్లో మాంసం కల్తీ కూడా జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. కానీ మటన్ దుకాణాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. కేవలం కబేళాలో ముద్ర వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మాంసం దుకాణాలు తనిఖీ చేసేందుకు నగర పాలక సంస్థలో పశు వైద్యుడితో పాటు ప్రతి డివిజన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు నగరంలో ఆర్‌ఓ ప్లాంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వాటిలో సగానికి పైగా నాణ్యత లేనివే ఉన్నాయి. అందుకు న్యూ రాజరాజేశ్వరీపేటలో నిర్వహించిన తనిఖీల్లో వచ్చిన రిపోర్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి నీళ్లు తాగి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. నగరంలోని ఫుడ్‌స్టాల్స్‌లో తనిఖీలు చేసే అధికారం కూడా ప్రజారోగ్య సిబ్బందికి ఉంటుంది. కానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మామూళ్లే కావాలి..
నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాళ్లు డబ్బులు లేనిదే ఏ పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి, షాపులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. జనన, మరణాల నమోదులో సైతం చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మాంసం దుకాణాలు, హోటళ్ల నుంచి కూడా మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తూ అసలు ప్రజారోగ్యాన్ని పక్కన పెడుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
తరచూ సాంక్రమిక వ్యాధులు..
నగర ప్రజలు తరచూ డయేరియా బారిన పడుతున్నారు. ఈ ఏడాది న్యూ రాజరాజేశ్వరీపేటలో దాదాపు 400 మంది డయేరియా బారిన పడ్డారు. ఇటీవల పాత రాజరాజేశ్వరిపేటలో మరో 10 మంది వరకూ డయేరియా బారిన పడిన విషయం తెలిసిందే. కలుషిత ఆహారం, నీరు కారణంగా తరచూ ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారంపై ఫుడ్ కంట్రోలర్‌తో పాటు, కార్పొరేషన్ ప్రజారోగ్య సిబ్బంది తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ, వాళ్లు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. దీంతో విచ్చలవిడిగా నాణ్యత లేని ఆహార విక్రయాలు జరగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడలోని దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌ఓ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తున్నాం. నాణ్యతను పరిశీలిస్తున్నాం.
– డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ


