టెట్ నుంచి మినహాయింపు కోరుతూ టీచర్ల నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కేఏ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిటీషన్లు వేయాల్సి ఉందన్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరిగా పాస్ కావాలని, లేకుంటే వారిని తొలగిస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీని కారణంగా రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ కావాల్సి వస్తుందని అంచనాలు ఉన్నాయన్నారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
రివ్యూ పిటీషన్ వేయడంలో జాప్యం..
సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని తాము విద్యాశాఖ మంత్రికి చెప్పటంతో ఆయన రివ్యూ పిటీషన్ వేయనున్నట్లు ప్రకటించారని ఉమామహేశ్వరరావు చెప్పారు. కానీ ప్రభుత్వం తరఫున ఈ పిటీషన్ వేయటంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనిని వేగవంతం చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు జె. లెనిన్‌బాబు, అధ్యక్షులు ఎండీ షౌకత్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో కె. చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు.
డీఆర్వోకు వినతిపత్రం సమర్పణ


