నిరసన ‘సంతకానికి’ విశేష స్పందన
పెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు చెబుతున్న విషయాలను విని, స్వచ్ఛందంగా ప్రజలు సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేల సంతకాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ నాయకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో 3,27,600మంది ప్రజలు సంతకాలు చేశారు. ప్రజల స్పందనను చూస్తుంటే ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యానికి మించేలా ఉందని ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జులు పేర్కొంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు సంతకాల సేకరణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంతకాల సేకరణను ముమ్మరం చేశారు.
క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు..
మంగళవారం పలు నియోజవర్గాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ గ్రామంలో, అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలోని వంతెన సెంటరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ముమ్మరంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సంతకాల సేకరణలో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లోను, పట్టణాల్లో వైఎస్సార్ సీపీ కుటుంబ శ్రేణులు ముమ్మరంగా సంతకాల సేకరణ చేస్తున్నారున్నారు. నియోజకవర్గా వారీగా పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ పెనమలూరులో 49,500, మచిలీపట్నంలో 65,000, గన్నవరంలో 43,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 52,000, గుడివాడలో 32,000 పామర్రు నియోజకవర్గంలో 43,100 సంతకాలు సేకరించారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3,27,600 సంతకాలు సేకరణ


