శుద్ధి చేసిన ధాన్యాన్ని అమ్మండి
చిలకలపూడి(మచిలీపట్నం): వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులందరూ శుద్ధి చేసిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచిన మాట వాస్తవమేనని, అయితే వాతావరణం పొడిగా ఉన్నందున రైతులందరూ తేమశాతం తగ్గేంత వరకు ధాన్యాన్ని ఆరబెట్టుకుని శుద్ధి చేసిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం ద్వారా విక్రయించి కనీస మద్దతు ధర పొందాలన్నారు. మద్దతు ధర పొందేందుకు వ్యర్ధ పదార్ధాలు, మట్టి రాళ్లు, చెత్త, తాలు తొలగించే విధంగా చూడాలన్నారు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన పురుగుతిన్న ధాన్యం లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 287 రైతు సేవా కేంద్రాల ద్వారా 2,46,473 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29,668 మంది రైతుల వద్ద నుంచి సేకరించామన్నారు. ఇప్పటివరకు 72,98,622 గోనె సంచులు ధాన్యం సేకరించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 4,199 వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటించి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్ నంబరు 82476 93551ను ఏర్పాటు చేశామన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్


