పామర్రులో ఆరు క్లినిక్‌లు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా వైద్యం నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలపై వేటు అనుమతులు లేకుండా ఇంజెక్షన్, సైలెన్లు నిల్వ చేయడం నేరం కృష్ణాజిల్లా డీఎం అండ్ హెచ్‌వో యుగంధర్
పామర్రు: ౖవెద్యశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా మితిమీరిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు(ఆర్‌ఎంపీ) నిర్వహించే ఆరు క్లినిక్‌లను సీజ్ చేసి మూసివేసినట్టు కృష్ణాజిల్లా డీఎం అండ్ హెచ్‌వో పి.యుగంధర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం శుక్రవారం పామర్రు గ్రామ పరిధిలోని పలు క్లినిక్‌లను డీఎంఆండ్‌హెచ్‌వో ఆకస్మిక తనిఖీలను చేశారు. క్లినిక్‌లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇంజెక్షన్‌లు, సైలెన్ బాటిల్స్, వైద్య పరికరాలను గమనించిన డీఎంఅండ్‌హెచ్‌వో క్లినిక్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సీజ్ చేసి క్లినిక్‌లను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎంపీ సర్టిఫికెట్ ఉన్న వారు అందరూ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలో కూడా తమకు ఇష్టం వచ్చినట్లు వైద్యం చేస్తున్నారని, వీరి చికిత్స వలన కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తమకు సమాచారం ఉందన్నారు. ఆర్‌ఎంపీలు జలుబు, దగ్గు, జ్వరం చూడటం, అవసరమైన మందులను ఇవ్వడమే తప్ప మిగిలిన ఏ విధమైన వైద్యం చేయరాదన్నారు.
తామే వైద్యులుగా...
తామే వైద్యులుగా చెలామణి చేసే విధంగా ప్రిస్కిప్షన్‌పై వారి పేర్లను వైద్యులుగా వేయించుకోవడం నేరమని, ఇది ప్రజలను మోసం చేయటమే అని అన్నారు. వారి క్లినిక్‌లలో రోగులను ఇన్‌పేషంట్‌లుగా రోజుల తరబడి బెడ్లపై ఉంచుతూ వారికి సంబంధించిన ఏ విధమైన రికార్డులను నిర్వహించకుండా వైద్యం అందించడం నేరమని అన్నారు. సరైన అనుభవం లేని వీరు రక్త పరీక్షలు చేయించడం, చిన్న చిన్న ఆపరేషన్‌లు చేయటం వలన ప్రజల ప్రాణాలకు హాని జరిగే ప్రమాదాలు ఉన్నాయని అన్నారు. ఇంజెక్షన్‌లు చేయటం, పరీక్షలు నిర్వహించేందుకు వీరికి ఏవిధమైన అధికారం లేదని స్పష్టం చేశారు. క్లినిక్‌లో ఇంజెక్షన్‌లు, సిలైన్ బాటిల్స్ నిల్వ చేయటం చట్ట రీత్యా నేరంగా పరిగణిస్తామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఆరు క్లినిక్‌లను సీజ్ చేసినట్టు చెప్పారు. సీజ్ చేసిన వాటిలో పామర్రులోని శివ క్లినిక్, రోహిణీ క్లినిక్, లక్ష్మీ క్లినిక్, వెంకటేశ్వరస్వామి క్లినిక్, ప్రజా వైద్యశాల, ఇందిర క్లినిక్‌లు ఉన్నాయని చెప్పారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంట కనుమూరు పీహెచ్‌సీ వైద్యాధికారి జెస్విన్ ఖాన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, పీహెచ్‌సీ సూపర్‌వైజర్ విజయసారథి, సీహెచ్‌వో స్టీవెన్, దీప్తి, సింధు, ఎంపీహెచ్‌ఏ(ఎం) టీవీ వేణుగోపాల ప్రసాద్ ఉన్నారు.
పామర్రులో ఆరు క్లినిక్‌లు సీజ్


