డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

Dec 6 2025 9:26 AM | Updated on Dec 6 2025 9:26 AM

డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

ఐజీ అశోక్‌కుమార్‌

అవనిగడ్డ: డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఐజీ అశోక్‌కుమార్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ సరఫరా దారులు, వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు మానటరింగ్‌ చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ద్వారా గతంలో కంటే డ్రగ్స్‌ వినియోగం తగ్గిందన్నారు. కృష్ణాజిల్లాలో గతంలో కంటే క్రైం రేటు బాగా తగ్గిందని చెప్పారు. పాత రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించామని, వీరికి ఎప్పటి కప్పుడు కౌన్సెలింగ్‌ ఇస్తూ సత్‌ ప్రవర్తనతో మెలిగేలా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం కొంతమంది శిక్షణలో ఉన్నారని వారంతా విధులకు హాజరైతే సిబ్బంది కొరత కొంతవరకూ తగ్గుతుందన్నారు. శిక్షణ పొందిన వారంతా విధుల్లో చేరిన తరువాత ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని ఐజీ తెలిపారు. అనంతరం క్రైం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, డీఎస్పీ విద్యశ్రీతో పాటు సిఐలులకు ఆయన దిశా నిర్ధేశం చేశారు. తొలుత ఆయన పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు.

కోతముక్క ఆడుతున్న 8 మంది అరెస్టు

+ రూ.2.26 లక్షలు స్వాధీనం

పెనమలూరు: మండలంలోని కానూరులో కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం కానూరు మహదేవపురం కాలనీ వద్ద కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద రూ.2.26 లక్షలు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

డి.ఎడ్‌ మూడవ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

మచిలీపట్నం అర్బన్‌: డిసెంబర్‌ 10 నుంచి ఏపీ టెట్‌–2025 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డి.ఈఐ.ఎడ్‌ మూడవ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 2024–26 బ్యాచ్‌ రెగ్యులర్‌ విద్యార్థులు, 2022–24, 2023–25 బ్యాచ్‌లకు చెందిన ఫెయిల్‌ అభ్యర్థుల కోసం డిసెంబర్‌ 15 నుంచి 20 వరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైందన్నారు. అయితే ఏపీ టెట్‌–2025 నిర్వహణను దృష్టిలో ఉంచుకొని డి.ఈఐ.ఎడ్‌ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ఆయన సూచించారు.

కృష్ణా విశ్వవిద్యాలయంలో స్పాట్‌ అడ్మిషన్లు

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ ఎల్‌.సుశీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షకు హాజరు కాని వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈనెల 8 వ తేదీన అభ్యర్థులు స్వయంగా రిపోర్టు చేయవచ్చని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement