నిషేఽధిత భూముల అర్జీలు ఆన్‌లైన్‌లో సమర్పించాలి
కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డలో భూముల క్రమబద్ధీకరణ దస్తావేజుల పట్టాలు పంపిణీ సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ స్వయం సహాయక సంఘాల స్టాల్స్ పరిశీలన
అవనిగడ్డ: నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్న 22ఎ నిషేధిత భూముల సమస్య పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయ సమావేశపు హాలులో శుక్రవారం జీవో నంబర్ 30 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22ఎ నిషేధిత భూముల సమస్య పరిష్కరించాలని కాగితాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే క్రమపద్ధతిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. 40 ఏళ్ల నుంచి ఎలాంటి హక్కు లేకుండా నివసిస్తున్న 40 మందికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు, పట్టాలు అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతిపై వెళుతున్న తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు దంపతులను కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు.
సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శన
అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ సందర్శించారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలు, డాక్టర్ల పనివేళలు, మందుల అందజేత, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, హెడ్‌నర్స్ భారతి పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల యూనిట్ల పరిశీలన
అవనిగడ్డలో పలు ప్రాంతాల్లో డీఆర్‌డీఏ వెలుగు ద్వారా ఆర్థిక సహాయం అందుకుని పలు షాపులు నడుపుతున్న యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. వారితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీదేవి, ఎంపీడీవో మరియాదేవి, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


