స్ఫూర్తిదాయక గాధలు రూపొందించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారుచేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలు, వ్యవసాయం, ప్రభుత్వ సేవలు వంటి విజయం సాధించిన గాధలను తయారుచేసి కృష్ణా స్ఫూర్తి పేరుతో ప్రతిరోజు వాడే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అవి ఇతరులకు స్ఫూర్తినిస్తాయని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. ఆయా రంగాల్లో విజయవంతం అవడానికి సహకరించిన అంశాలను వివరిస్తూ, ఇతరులు కూడా అదే స్ఫూర్తితో ఎదగవచ్చని, అందుకు ప్రభుత్వపరంగా అందించే సహకారాన్ని, వనరులను తెలియపరుస్తూ ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన వివరాలను ఆ కథలో పొందుపరచాలన్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా మహిళల వ్యాపారాలు, పాడి పరిశ్రమ, వ్యక్తిగత వ్యాపారాలు తదితర రంగాల్లో విజయగాధలను గుర్తించాలన్నారు. దీనికి గృహనిర్మాణ సంస్థ ఇన్‌చార్జ్ పీడీ పోతురాజు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానశాఖల అధికారులు చిన్ననరసింహులు, ఎ.నాగరాజు, జె.జ్యోతి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు ఎన్‌వీ శివప్రసాద్‌యాదవ్, హరిహరనాథ్, ఏపీ ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారధి, ఎల్‌డీఎం రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


