మమ..అనిపించారు!
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొక్కుబడి తంతుగా రైతన్నా మీకోసం ఏడాదిన్నర పాలనలో పండగ లాంటి వ్యవసాయాన్ని దంగడలా చేశారు ధాన్యం, పత్తి కొనుగోళ్ల పైన రైతుల్లో తీవ్ర అసంతృప్తి కాలువల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం రైతుల ఎదుట పడే ధైర్యం లేక ముఖం చాటేసిన ప్రజాప్రతినిధులు
ముఖం ఎందుకు చాటేశారంటే...
‘రైతన్నా మీకోసం’ అట్టర్ ఫ్లాప్
మమ్మల్ని పట్టించుకున్న వాళ్లే లేరు
రైతన్నా..మీకోసం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరో డ్రామాకు తెరతీసింది. వైఎస్సార్ సీపీ పాలనలో పండగ లాంటి వ్యవసాయాన్ని ఈ ఏడాదిన్నర పాలనలో దండగలా మార్చి చంద్రబాబు తన మార్కు పాలన మళ్లీ రైతులకు చవిచూపించాడు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ, అరటి, టమాటా ఇలా ఏ రైతును కదిపినా కన్నీటి సంద్రమే. ఆర్‌బీకే వ్యవస్థను నీరుగార్చి, పంటల బీమాకు ఎసరు పెట్టి, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం ఊసే మరిచిన బాబు ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని రైతన్నా..మీకోసం అంటూ వస్తుందని రైతులు తూర్పారపడుతున్నారు. రైతుల ఎదుట పడే ధైర్యం లేక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదో మొక్కుబడిగా కార్యక్రమంగా కానిచ్చి చేతులు దులుపుకొన్నారు.
రైతన్నా మీ కోసం కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టింది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులకు మాత్రమే సమాచారం అందించారు. మా బోటి కౌలురైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం కార్యక్రమం జరుగుతుందన్న సమాచారం కూడా తెలీదు. కౌలురైతుల ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం లేదు. అలాంటప్పుడు కార్యక్రమం చేపట్టి ప్రయోజనం ఏముంది?
–కౌలా అశోక్, కౌలురైతు, తటివర్రు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన ‘రైతన్నా మీకోసం ’ కార్యక్రమం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొక్కుబడిగా సాగింది. ఏడాదిన్నర పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదు. పైగా విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలి వేశారు. దీంతో ఎక్కడ నిలదీస్తారోననే భయంతో రైతుల ముందుకు వెళ్లే ధైర్యం లేక మంత్రి, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని తమతమ నియోజకవర్గాల్లో తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘంటశాలలో రైతన్నా...మీకోసం కార్యక్రమంలో పాల్గొ న్నా, రైతులతో కలిసి నేరుగా మమేకం కాకుండా, వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్లకార్డులు, కరపత్రాలు పట్టుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చి తంతు ముగించారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల వద్దకు తమ సానుభూతిపరులను పిలిపించుకుని ఫొటోలు దిగి మమ అనిపించారు. ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ, సమాచార, నిర్వహణ వ్యవస్థ)యాప్‌ను రైతుల ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే బాధ్యతను ఆర్‌ఎస్‌కే సిబ్బందికి అప్పగించారు. తొలిరోజు హడావిడి చేసినా మరునాటి నుంచి ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. సిబ్బంది తమకున్న పరిచయాలతో కొంతమంది రైతులకు యాప్ ఇన్‌స్టాల్ చేసి మమ అనిపించారు.
పంచసూత్రాల్లేవ్...
‘‘నేను మీ రైతు బిడ్డనే రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తెలుసు, మీతో కలిసి నడవడానికి, మీసమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. రైతన్నా మీకోసం క్షేత్రస్థాయిలో పూర్తిగా ఫెయిల్ అయిందనే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.
అధ్వానంగా పంట కాలువలు
పంట కాలువల్లో కనీసం తూటికాడ, పూడికతీత, మరమ్మతులు చేపట్టక పోవడంతో నీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరందక ఇబ్బందులు పడ్డారు. పెడన, అవనిగడ్డ ప్రాంతంలో ఇంజిన్ల ద్వారా పంట పొలాలను తడుపుకొనే దుస్థితి నెలకొంది. పంటలకు కనీస మద్దతు ధర లబించటం లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వద్దకు వెళితే ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజా ప్రతినిధులు ముఖం చాటేశారు.
గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో రైతన్నా మీ కోసం కార్యక్రమం రైతులు లేకుండానే సాగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ మండలంలో మాత్రమే పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో మాత్రం అధికార పార్టీ రైతులతో మమ అనిపించారు. కేవలం ఫొటోలకు ఫోజులిస్తూ, ప్రచారార్భాటంగానే సాగింది తప్ప రైతు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం జరగలేదు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాలలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించి రైతన్నా మీ కోసం కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రం సందర్శించారు. శ్రీకాకుళం, మోపిదేవి, ఘంటసాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. కనీసం ఆయా గ్రామాల్లో రైతులకు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలీని దుస్థితి.
పామర్రు,పెదపారుపూడి, తోట్లవల్లూరు ప్రాంతాల్లో రైతన్నా మీ కోసం కార్యక్రమానికి స్పందన కరువైంది. రైతులకు కనీసం కార్యక్రమం గురించి తెలీదు. ఎమ్మెల్యే వర్ల కుమారరాజా పామర్రులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమానికి టీడీపీకి చెందిన రైతు వర్గాన్ని మాత్రమే ఆహ్వానించారు. గ్రామంలోని రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మంత్రి కొల్లు రవీంద్ర తూతూమంత్రంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రచారానికి ఇచ్చిన శ్రద్ధ రైతుల సమస్యలు తెలుసుకోవటంలో చూపలేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పెడన నియోజకవర్గంలో రైతన్నా మీ కోసం కార్యక్రమం అంతంతమాత్రంగానే సాగింది. పెడనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. రైతుల సమీకరణ జరగలేదు. చోటా మోటా నేతలతోనే కార్యక్రమం పరిమితం అయ్యింది. రైతు సమస్యలు తెలుసుకుని యాప్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పి కరపత్రాలు పంపిణీ చేశారు. రైతుల సమస్యలు అప్‌లోడ్ అయ్యిందీ లేనిదీ తెలియని పరిస్థితి.
మేము రెండెకరాల్లో వరి సాగు చేశాం. తుపాను కారణంగా పంట తడిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మా దగ్గరకు వచ్చి మా బాధలు విన్నవాళ్లు లేరు. టార్పాలిన్‌లు, పరదాలు కూడా మాకు ఇచ్చినోళ్లు లేరు. వర్షంతో ఓ వైపు ఇబ్బందులు పడుతూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అధికారులు, ఏ ఒక్కరూ మా వైపు వచ్చినోళ్లు లేరు.
–పల్లపోతు భవాని, కౌలురైతు,
నెప్పల్లి, కంకిపాడు మండలం
ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మంద కొడిగా సాగుతున్నాయి. సంచులు, వాహనాల కొరత పట్టి పీడిస్తోంది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్లపైనే ఉండిపోయింది. దీనికితోడు దిత్వా తుపాను తోడవడంతో, వారం పదిరోజులుగా ధాన్యపు రాసులు అలానే ఉండిపోయాయి. ధాన్యం ఆరబెట్టే అవకాశం లేక పలు చోట్ల ధాన్యం బూజు పట్టి రంగు మారడంతో పాటు, కొన్ని చోట్ల మొలకలు సైతం వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో, రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద 1,56,827 మంది రైతులకు లబ్ధి కలగ్గా, ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.33 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో గత ప్రభుత్వంలో 1.28 లక్షల మందికి లబ్ది కలుగగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.08 మందికి మాత్రమే మేలు చేకూరింది. అన్నదాత సుఖీభవ పథకంలో కూడ కోత విధించింది.
మమ..అనిపించారు!
మమ..అనిపించారు!


