నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పాములపాటి నరేంద్ర, శ్వేత అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116ల విరాళాన్ని సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు జగదీష్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ఎస్‌ఎంసీని సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలను జెనీవా నుంచి వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), వరల్డ్ డయాబెటీస్ ఫౌండేషన్(డబ్ల్యూడీఎఫ్) బృందాలు గురువారం సందర్శించాయి. ఈ సందర్భంగా కళాశాలలోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అనుసరిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, వివిధ ప్రొటోకాల్స్‌పై విస్తృతంగా చర్చ జరిగింది. ఆయా విభాగాల పనితీరును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వారికి వివరించారు. ఇక్కడ అనుసరిస్తున్న వ్యవస్థీకృత విధానంపై ప్రపంచ బృందాలు ప్రశంసలు వ్యక్తం చేశాయి. ఇక్కడి యూనిట్‌లో అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ను జెనీవాలో జరగనున్న సమావేశంలో ఉత్తమ మోడల్‌గా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆశా పర్వీన్ సమన్వయంతో విజయవంతం చేశారు.
సమగ్ర వికాసానికి క్రీడలు కీలకం
మచిలీపట్నంఅర్బన్: పిల్లల సమగ్ర వికాసానికి క్రీడలు కీలకమని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ తెలిపారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన సీడబ్ల్యూఎస్‌ఎన్ స్పోర్ట్స్ మీట్ (పారా ఒలింపిక్స్)ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. పోటీలలో విజేతలైన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో మానసిక వికాసంతో పాటు శారీరక వికాసం కూడా ఎదుగుదలకు ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు దేనిలోనూ తీసిపోరని, వివిధ క్రీడల్లో ప్రదర్శించిన ప్రతిభతో మరోసారి రుజువైందన్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్క్‌త్రో విభాగాల్లో పిల్లలు మెరుగైన ప్రతిభ కనబర్చారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సత్యనారాయణ, పారా ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రీడల అధికారి ఝాన్సీ, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఏడుకొండలు, సెక్టోరల్ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం


