బస్సులో నగలు చోరీ చేసిన నిందితురాలి అరెస్ట్
జగ్గయ్యపేటఅర్బన్: ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్‌ను, దానిలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.7 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిల్లకల్లు ఎస్‌ఐ టి.సూర్యశ్రీనివాస్‌తో కలిసి సీఐ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2న విజయవాడ నుంచి కంచికచర్ల వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఫిర్యాదుదారు శొంఠి అమలేశ్వరి హ్యాండ్ బ్యాగ్‌ను, అందులో ఉన్న బంగారు ఆభరణాలతో సహా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ ఐపీఎస్ పర్యవేక్షణలో, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో తాను సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
సిబ్బందికి అభినందనలు..
ఫిర్యాదుదారు ప్రయాణించిన బస్సు ఆగిన అన్ని స్టాపుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా, కంచికచర్ల బస్ స్టాప్ ఇన్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో హ్యాండ్ బ్యాగ్‌ను పట్టుకొని బస్సు దిగుతున్న మహిళలను గుర్తించినట్లు తెలిపారు. లోకల్ పోలీసుల సహాయంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. బాధితురాలు బస్సులో నిద్రపోతుండగా హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకొని కంచికచర్లలో దిగినట్లు చెప్పిందన్నారు. అనంతరం ఆమె నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు ఆభరణాలను, 8 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితురాలు కంచికచర్ల మండలం, ఎస్.అమరవరం గ్రామానికి చెందిన పాలపర్తి విశాలాక్షి అని గుర్తించామన్నారు. తక్కువ సమయంలో నిందితురాలిని అరెస్ట్ చేయడంతో పాటు పూర్తి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తనను, చిల్లకల్లు ఎస్‌ఐలు టి.సూర్యశ్రీనివాస్, ఎస్‌ఎన్‌ఎస్.మణికంఠ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారని చెప్పారు.
బస్సులో నగలు చోరీ చేసిన నిందితురాలి అరెస్ట్


