విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు
కోనేరుసెంటర్: విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయనాయుడు అన్నారు. విద్యాలయాల్లో విద్యను మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని కూడా బోధించి విద్యార్థులను సంస్కారవంతమైన భారతీయులుగా తయారు చేయాలని ఆయన తెలిపారు. మచిలీపట్నం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం ప్రారంభమైన కృష్ణాతరంగ్ – 2025 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగాల భర్తీలో తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్నారు. ఆ దిశగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాష తెలుగులోనే పాలనాపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిమితికి మించి ఉపయోగిస్తూ బానిసలుగా మారి సమయాన్ని వృథా చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఆ సమయాన్ని లక్ష్యసాధనకు నైపుణ్య అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవు పలికారు. యువత దేశ సంపద అని యువతలో స్ఫూర్తిని నింపి మార్గనిర్దేశం చేస్తే దేశానికి గొప్ప సంపదగా తయారవుతారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలోని ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ జిల్లా చరిత్ర, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉప కులపతి కూన రాంజీ, రెక్టర్ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉష, ప్రోగ్రాం కన్వీనర్ దిలీప్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీ పట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్, బీజేపీ నాయకులు పీవీ గజేంద్రరావు, సోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


