పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి
కోనేరుసెంటర్: పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బందరు మండలంలోని పోతేపల్లి గ్రామ సచివాలయం పై అంతస్తులో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ అదనపు కమిషనర్ శివప్రసాద్‌లతో కలిసి కలెక్టర్ బాలాజీ గురువారం ప్రారంభించారు. అనంతరం డీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
సమన్వయంతో అభివృద్ధి సాధించాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, వారికి సంబంధించిన వివిధ రకాల పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకుండా డివిజనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల వద్దకు రావాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా అమలుపరుస్తున్న పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును డివిజనల్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారులు సజావుగా పర్యవేక్షించాలన్నారు. డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అభివృద్ధి సాధించాలన్నారు. డివిజన్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


