నిటలాక్షుడికి నీరాజనం
చివరి ఆదివారం భక్తుల రద్దీ కృష్ణా నదిలో పుణ్యస్నానాలు అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు
అమరావతి: కార్తిక మాసంలో ఆఖరి ఆదివారం కావటంతో పంచారామాలలో ప్రథమ రామ క్షేత్రమైన అమరావతికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో కార్తిక సందడి నెలకొంది. వేకువజామున పంచారామక్షేత్ర సందర్శకులు అమరేశ్వరాలయానికి చేరుకున్నారు. తొలుత పవిత్ర కృష్ణానది ఒడ్డున అమరేశ్వర ఘాట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక షవర్ల కింద పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద దీపారాధనలు చేసి శివకేశవులకు పూజలు చేశారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలల, కళాశాలల విద్యార్థులు వేలాదిగా అమరావతి తరలివచ్చారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పాత, కొత్త మ్యూజియంలు, అమరేశ్వరాలయం, స్నానఘాట్‌లు, విద్యార్థులు, భక్తులు, యాత్రికులతో కళకళలాడాయి. సుమారు పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు దేవాలయ అధికారులు పేర్కొన్నారు.
అమరేశ్వరాలయం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహాల ఆవరణలో వన భోజనాలు నిర్వహించుకున్నారు.
భక్తుల కోలాహలం
నరసరావుపేట రూరల్: శైవక్షేత్రం కోటప్పకొండలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతోపాటు కోటప్పకొండలో పలు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు నిర్వహించడంతో త్రికోటేశ్వరస్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహానందీశ్వరుడు వద్ద కార్తిక దీపాలు వెలిగించి మహిళలు పూజలు నిర్వహించారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నిటలాక్షుడికి నీరాజనం


