శిశువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నెలలు నిండకుండా పుట్టే శిశువులు, వారి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందని రెయిన్‌బో నియోనాటల్ నిపుణులు డాక్టర్ బీఎస్‌సీపీ రాజు అన్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్లకు పైగా శిశువులు ప్రీమెచ్యూర్‌గా జన్మిస్తున్నారని, వారికి ప్రత్యేకించి, అత్యున్నత సంరక్షణ అవసరమని ఆయన తెలిపారు. నవంబరు 17వ తేదీ ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం సందర్భంగా అలాంటి శిశువుల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియాకు వివరించారు. నెలలు నిండని శిశువులకు ఊపిరితిత్తులు, మెదడుతో పాటు ముఖ్యమైన అవయవాల ఎదుగుదల పూర్తిగా ఉండదని తెలిపారు. అలా పుట్టిన వెంటనే వారికి శ్వాస సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సరైన ఎన్‌ఐసీయూ కేర్, నిపుణుల పర్యవేక్షణతో వారి ప్రాణాలను కాపాడగలమని సూచించారు.
నివారణకు సూచనలు
గర్భిణులకు క్రమం తప్పని చెకప్‌లు, పోషకాహారం, జీవనశైలి, మధుమేహం, రక్తపోటు ఉంటే అదుపులో ఉంచుకోవాలన్నారు. నెలలు నిండని బిడ్డ పుడితే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించాలన్నారు. వీలైనంత వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డను తల్లి చర్మానికి దగ్గరగా ఉంచితే బిడ్డ బరువు పెరగడానికి, వేడికి కాపాడుకోవడానికి సహాయపడుతుందన్నారు. సరైన వైద్యం అంకితభావం ఉంటే ఇలాంటి చిన్నారులు మామూలు పిల్లల్లా ఎదుగుతారని డాక్టర్ రాజు అన్నారు.
ఇన్‌ఫెక్షన్‌లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం


