చెరుకు తోటకు నిప్పంటించిన ఆకతాయిలు
వీరులపాడు: చెరుకు తోటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని అగ్నికి ఆహుతైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం మండలంలోని నరసింహారావుపాలెంకు చెందిన జంగా సాంబశివారెడ్డికి గ్రామ సమీపంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనిలో అతను చెరుకు సాగు చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్న సమయంలో కొందరు ఆకతాయిలు చెరుకు తోటకు నిప్పంటించడంతో రెండెకరాల మేర చెరుకుతోట పూర్తిగా దగ్ధమైంది. దీన్ని గమనించిన రైతులు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఘటనలో సుమారు రూ. 1.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కారంపూడి: ఎంతో ఘన చరిత్ర కలిగిన కారంపూడి పల్నాటి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను, జిల్లా ఎస్పీ కృష్ణారావులను పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్న కేశవ, పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్‌కుమార్ ఆహ్వానించారు. నరసరావుపేటలో ఆదివారం కలెక్టర్, ఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగుతాయని మొదటి రోజు రాచగవు, రెండోవ రోజు రాయబారం, మూడవ రోజు మందపోరు, నాల్గవ రోజు కోడిపోరు, ఐదో రోజు కల్లిపాడు పేర్లతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడవ రోజు మందపోరు రోజుఅలనాడు బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకూడు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పలు స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో కార్యక్రమం వైభవంగా జరుగుతుందని వారికి వివరించారు. వారి వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లునాయక్, ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డి, గ్రామ పంచాయితీ కార్యదర్శి కాసిన్యా నాయక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కులగణన చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ పేర్కొన్నారు. సూర్యలంక రోడ్డులోని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య స్వగృహంలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పై అంశంపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు ‘బీసీ జనగణన– వర్గీకరణలు‘ జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకూడదని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వెంటనే కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య మాట్లాడుతూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి, సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ నాయకులు జీవీఎల్ మోహన్ గౌడ్, కంకణాల రాంబాబు, యు.శ్రీను, దాసు, యువరాజ్ పాల్గొన్నారు.
అగ్నికి ఆహుతి


