● కార్తిక మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో..
● ఇంద్రకీలాద్రిపై సర్వదర్శనానికి రెండు గంటలు ● అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు
దుర్గగుడిలో భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలు
మల్లేశ్వరస్వామి సన్నిధిలో సహస్ర లింగార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం ఆఖరి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం కనిపించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వీఐపీ సిఫార్సులపై వచ్చే వారికి సైతం రూ. 300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో ఉభయదాతలు పాల్గొన్నారు. నూతన వధువరులు పెళ్లి బట్టలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
ఓం టర్నింగ్‌కు చేరిన భక్తుల క్యూ
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల రాక కనిపించింది. పలు అసోసియేషన్లు, స్నేహ బృందాలు, సంఘాలు విజయవాడ పరిసరాల్లో కార్తిక వన సమారాధనాలు ఏర్పాటు చేశాయి. వారు తొలుత అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కొండ దిగువన కనకదుర్గనగర్, సీతమ్మ వారి పాదాలతో పాటు హెడ్ వాటర్ వర్కు వద్ద కార్లు, ఇతర వాహనాలతో బారులు తీరి కనిపించాయి.
మధ్యాహ్నం 12 గంటలకు ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు భక్తులు క్యూ కనిపించింది. మహామండపంలో 5వ అంతస్తు వరకు రద్దీ ఏర్పడటంతో దర్శనం త్వరత్వరగా అయ్యేలా అధికారులు క్యూలైన్లను ముందుకు నడిపించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆ తర్వాత అంతరాలయ దర్శనానికి అనుమతించారు.
మల్లేశ్వరుడికి విశేష పూజలు
ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామికి త్రికాల అర్చనలు, అభిషేకాలతో పాటు సాయంత్రం సహస్ర లింగార్చన జరిగింది. స్వామివారికి సాయంత్రం మహా నివేదన అనంతరం పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలను ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. సహస్ర లింగార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ ప్రత్యేక పూజలు చేశారు.
భక్తజన సందోహం
భక్తజన సందోహం
భక్తజన సందోహం


