సాగరతీరంలో కార్తిక సందడి
●హంసలదీవి బీచ్‌లో పర్యాటకుల కళకళ
●తీరంలో సహపంక్తి భోజనాలు
కోడూరు: హంసలదీవి సాగరతీరం కార్తిక సందడితో కళకళలాడింది. కార్తిక మాసంలో ఆఖరి ఆదివారం కావడంతో సాగరతీరంలో సరదాగా గడిపేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున నుంచే ప్రత్యేక వాహనాల్లో పర్యాటకులు తీరానికి వచ్చి అలల మధ్య కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. మహిళలు తీరంలో కార్తిక దీపాలు వెలిగించి భక్తిభావం చాటుకున్నారు. చిన్నారులు ఇసుకతో పిచ్చుకగూళ్లు కట్టుకున్నారు. యువకులు బీచ్ వాలీబాల్, విద్యార్థినులు వివిధ రకాల ఆటలతో సందడి చేశారు. యాత్రికులు తీరంలోనే కుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఉభయగోదావరి ప్రాంతాలకు చెందిన యాత్రికులు పెద్దసంఖ్యలో వచ్చారు.
తీరంలో అధికారుల గస్తీ
పర్యాటకుల రాకతో పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి సిబ్బందితో కలిసి తీరంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. స్నానాలు చేసే పర్యాటకులకు లౌడ్‌స్పీకర్ల ద్వారా సూచనలిస్తూ అప్రమత్తం చేశారు. సాగర సంగమం వద్ద ఊహకందని లోతు ఉండటంతో ఆ ప్రాంతంలో కార్తిక స్నానాలను పోలీసులు నిషేధించారు. ఎస్‌ఐలు చాణిక్య, పూర్ణమాధురి, సిబ్బంది పాల్గొన్నారు.
సాగరతీరంలో కార్తిక సందడి


