జనగణనతో సమగ్ర కులగణన నిర్వహించాలి
ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కుల గణనను శాసీ్త్రయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 9వ తేదీన నగంరలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమన్నారు. బీసీ రిజర్వేషన్లలో సమన్యాయం కోసం వర్గీకరణ (ఏ,బీ,సీ,డీ) చేయాలని, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణలు చేయించి బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్–9లో చేర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందున కుల గణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్. ఎన్.మూర్తి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోము మహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు చప్పిడి చందు పాల్గొన్నారు.


