ముగిసిన యోగ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు
గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి యోగ అండర్–14, అండర్–17 బాల, బాలికల ఎంపికలు గురువారం ముగిశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాల, బాలికలు ఈ ఎంపికలలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన బాల, బాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి. రాంబాబు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి యోగ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి.నాగరాజు, సెలక్షన్ కమిటీకి చెందిన పూర్ణచంద్రరావు, శిరీష, మల్లేశ్వరరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మైలవరం: పరీక్షల నిర్వహణ సమయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. మైలవరం మండల పరిధిలో ప్రతిపాదిత ఎస్‌ఎస్‌సీ–2026 పరీక్ష కేంద్రాలను జిల్లా ఏపీవోఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎస్.రాంబాబుతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ప్రతి పాఠశాలలోని సదుపాయాలు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, సీటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతం, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో మైలవరం మండల విద్యాశాఖాధికారి ఎల్.బాలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కార్తికేయుని దర్శించుకున్న పాట్నా హైకోర్టు జడ్జి
మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గురువారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు తొలుత నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి, న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
మోంథా బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పంట నష్టం తక్కువేనని చెప్పడం బాధాకరమన్నారు. వర్షానికి తడిసిపోయిన పత్తికి మద్దతు ధర కల్పించి రైతుల వద్ద ఉన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న అఖిల భారత కిసాన్ మోర్చా, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు, ర్యాలీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దువ్వనపల్లి సురేందర్ రెడ్డి, ఎ.రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు, బి.సత్య నాయుడు, జి.రామ్ రెడ్డి, కోటా మధుసూదన్ రావు, పోతిన సంపత్ కుమార్ పాల్గొన్నారు.
ముగిసిన యోగ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు
ముగిసిన యోగ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు


