పోలీసుల అదుపులో ఎన్‌ఆర్‌ఐ సోషల్ మీడియా యాక్టివిస్టు
పెనమలూరు: కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారటం లేదు. యూకేకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మాలపాటి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఉన్నారు. ఆయన తన తండ్రి మరణించటంతో అంత్యక్రియల కోసం కొద్ది రోజుల క్రితం మండలంలోని చోడవరం గ్రామానికి వచ్చారు. భాస్కర్‌రెడ్డి రాకను గమనించిన టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. భాస్కర్‌రెడ్డి గురువారం మెడికల్ చెకప్ కోసం కామినేని ఆస్పత్రికి వెళ్లగా పెనమలూరు పోలీసులు ఆస్పత్రికి వచ్చి భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు భాస్కరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
పోలీసుల వీరంగం...
పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భాస్కర్‌రెడ్డి సోదరుడు ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు వీరంగం వేశారు. ఓబుల్‌రెడ్డి తన సోదరుడు భాస్కర్‌రెడ్డి ఆచూకీ చెప్పాలని పోలీసులను కోరారు. తన తండ్రి పెదకర్మ ఉందని, ఈ సమయంలో తన సోదరుడిని కనిపించకుండా చేయటం న్యాయం కాదని పోలీసులను ప్రాథేయపడ్డారు. అయితే పోలీసులు ఆయన మొర ఆలకించకపోగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్ ఇవ్వాలని, బెయిల్ తీసుకుంటానని ఓబుల్‌రెడ్డి కోరినా పోలీసులు ఏ మాత్రం కనికరం చూపకుండా పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోమని హెచ్చరించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి తీవ్ర అభ్యంతరం తెలిపారు. భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు, ఎక్కడ ఉన్నాడో కుటుంబ సభ్యులకు తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ, చక్రవర్తి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు మోహరించి పార్టీ నేతలను పోలీస్‌స్టేషన్ బయటే ఉండాలని ఆజ్ఞాపించారు.
చట్టాన్ని అత్రికమించిన పోలీసులు
పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వ్యక్తి హక్కులను కాలరాశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు అందితే భాస్కర్‌రెడ్డిపై విచారించాలన్నారు. అయితే పోలీసులు భాస్కరరెడ్డిని రహస్య ప్రాంతంలో దాచి ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చూపించకుండా వారిని ఆందోళనకు గురి చేశారని విమర్శించారు. తండ్రి పెదకర్మ కార్యక్రమం చేయనీయకుండా భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకోని వేఽధించడం దారుణమని ఖండించారు. తప్పుడు ఫిర్యాదులు చేయించటానికి పోలీసులు టీడీపీ నేతలతో చేతులు కలిపారని ఆరోపించారు. సీఐ వెంకటరమణ వివరణ కోసం యత్నించగా ఆయన ఫోన్‌లో స్పందించలేదు. రాత్రి వరకు భాస్కర్‌రెడ్డి ఆచూకీ గాని, ఎఫ్‌ఐఆర్ వివరాలు కాని కుటుంబ సభ్యులను పోలీసులు తెలుపలేదు.
పోలీసుల అదుపులో ఎన్‌ఆర్‌ఐ సోషల్ మీడియా యాక్టివిస్టు


