పేదల ఇళ్లంటే చులకనా..?
పట్టించుకున్న వారు లేరు
రోగాల బారిన పడాల్సి వస్తుందేమో?
మోంథా తుపాను తీరం దాటి పది రోజులవుతున్నా ఇంకా పేదల ఇళ్లకు ముంపు బెడద పోలేదు. మోకాలి లోతు వరద నీటిలో నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఒక్క పూట అన్న క్యాంటీన్ భోజనం పెట్టి మమ అనిపించింది. ఆ తరువాత పాలకులు కాని, అధికారులు కాని అటువైపు కన్నెత్తిచూసిన పాపాన పోలేదు. ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయి...చివరకు స్థానికులే తలా కొంత వేసుకుని మోటార్లు పెట్టి నీళ్లు తోడించుకుంటున్నారు.
నందిగామరూరల్: నందిగామ పట్టణంలోని 18వ వార్డు శివారు ఉమా కాలనీలో సుమారు 15 కుటుంబాలకు చెందిన దాదాపు 70 మంది కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వారి గృహాలు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో మోంథా తుపాను ధాటికి వరద నీరు ముంచెత్తింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాలనీ వాసులు వరద ముంపులోనే కాలం వెళ్ల దీస్తున్నారు. వర్షపు నీటితో పాటు చుట్టుపక్కల పంట పొలాల్లోని నీరు, దూళ్ల వాగు పొంగి పొర్లటంతో వరద నీరు మొత్తం కలసి కాలనీలోని ఇళ్ల మధ్యకు చేరి దాదాపు ఐదారడుగుల మేర నిలిచి ఉండటంతో కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. తమ దీన పరిస్థితిని మున్సిపల్ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుల తరబడి వరద నీటిలోనే...
మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు తోడు దూళ్ల వాగు పొంగి పొర్లటంతో పక్కనే ఉన్న కాలనీని వరద నీరు ముంచెత్తింది. తుపాను తీరం దాటే రోజు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు వచ్చి అన్న క్యాంటీన్‌లో నుంచి తీసుకొచ్చిన అన్నం పెట్టి మమ అనిపించారు తప్ప తమను పట్టించుకున్న పాపాన పాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి కుళాయిలు కూడా వరద నీటిలోనే ఉండటంతో దాహార్తిని తీర్చుకునేందుకు సైతం అలమటించామని వాపోయారు. తమను ఆదుకోకపోయినా పర్వాలేదు కనీసం వరద నీటినైనా బయటకు పంపే చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడినా కన్నెత్తి కూడా చూడలేదని మండిపడుతున్నారు. రోడ్డు కూడా కనిపించనంతగా వరద నీరు చేరటంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
తురకపాలెం ఘటనను గుర్తు చేస్తున్న స్థానికులు
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికే అధికారులు తామిక్కడ రోజుల తరబడి వరద నీటిలో ఉన్నా తమను పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని రోగాల బారిన పడాల్సివస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరద నీరు, దోమల బెడదతో ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో జరగిన ఘటనే తమకు గుర్తుకు వస్తోందని హడలిపోతున్నారు. ఏడాది లోపు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు జీవనం సాగిస్తున్నామని పరిస్థితి చేయి దాటితే బాధ్యత వహించేదెవరని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థలే ఆదుకున్నాయి..
తమ పరిస్థితిని చూసి స్వచ్ఛంద సంస్థలు స్పందించి బియ్యం, సరుకులు అందించి తమ వంతుగా అండగా నిలిచాయి తప్ప అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరద నీటిని బయటకు పంపటంతో పాటు అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మోంథా తుపాను నాటి నుంచి నేటి వరకు తొమ్మిది రోజుల పాటు వరద నీటిలోనే అవస్థలు పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. ఒక్కపూట అన్నం పెట్టారు ఆ తరువాత తిన్నామా?.. ఉన్నామా?.. అని కూడా ఎవరూ కన్నెత్తి చూడలేదు. స్థానికులంతా చందాలు వేసుకుని రోజుకు రూ. రెండు వేలు వెచ్చింది ఆయిల్ ఇంజిన్ పెట్టి నీటిని తోడుకుంటున్నాం. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పంధించి ఆదుకోవాలి.
–బత్తుల వెంకటేశర్లు, స్థానికుడు
ఇళ్ల మధ్యకు ఐదారడుగుల మేర వరద నీరు చేరింది. రోజుల తరబడి వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నాము, నీటి నిల్వ కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. విష పురుగులు సంచరిస్తున్నాయి. చంటి పిల్లలు, వృద్దులున్నారు. దోమల బెడదతో రోగాల బారిన పడాల్సి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నీటిని బయటకు పంపటంతో పాటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.
–పవన్, నివాసితుడు
పేదల ఇళ్లంటే చులకనా..?
పేదల ఇళ్లంటే చులకనా..?


