మనసు మాయం.. యంత్రమయం
చిన్న విపత్తుకే మానసిక కల్లోలం సమస్యలను అధిగమించలేకపోతున్న పరిస్థితి మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలంటున్న నిపుణులు సంతృప్తికర జీవనం సాగించాలంటున్న వైద్యులు
మానసిక ప్రశాంతతతో ఆరోగ్యం
సానుకూల దృక్పథంతో సాగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోతున్నాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్‌లను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్‌ఫోన్‌లలో మాట్లాడటానికే కాలం సరిపోతోంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి, ఒకేచోట కూర్చుని భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారిపోవడమే కాక, ఉత్పాదక శక్తి తగ్గిపోతోందని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి కంటే కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంతృప్తి లేని జీవితాలు
మనిషికి ఆశ, అత్యాశ పెరిగి, సంతృప్తి అనేది జీవితంలో లేకుండా పోయింది. చిన్న విపత్తు వచ్చినా అధిగమించలేక మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మనూన్యతా భావానికి లోనవుతున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా చెరొక గదిలో కూర్చుని ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో దాంపత్య జీవితంపై పెను ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. మొండి వైఖరి ఇగో ప్రాబ్లమ్స్ వంటివి భార్య భర్తల మధ్య గ్యాప్‌ను పెంచుతున్నట్లు చెపుతున్నారు.
చిన్న విపత్తును సైతం ఎదుర్కోలేక...
ఇలా వ్యక్తిగత విపత్తులు, ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెపుతున్నారు. శారీరక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారే కానీ, మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోక పోవడంతో పరిస్థితులు విషమిస్తున్నాయి.
యంత్రంలా మారిపోతున్న మనిషి
ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక వత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ ఫలితంగా గుండెపోటు, మెదడుపోటుకు దారితీయవచ్చు. విపత్తులు ఎన్ని ఎదురైనా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడు.
–డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు
ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. పకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆస్తులు కోల్పోవడం, సంబంధీకులను కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో మానసిక దృఢత్వం అవసరం. ప్రభుత్వాలు సైతం మద్దతుగా నిలవాలి. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపడం ద్వారా వత్తిడిల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి.
–డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్
మనసు మాయం.. యంత్రమయం


