జి.కొండూరు: కారు ఢీ కొనడంతో సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి విద్యానగరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధి పినపాక గ్రామానికి చెందిన కోసూరి బాబూరావు(57) సైకిల్‌పై జి.కొండూరు వైపు నుంచి 30వ నంబర్ జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో పినపాక వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యానగరం వద్ద పినపాక గ్రామం వైపు యూటర్న్ తీసుకుంటుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు సైకిల్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన బాబూరావు తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. క్షతగాత్రుడిని ఢీ కొట్టిన కారులోనే చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై రామరాజుపాలెం అడ్డరోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన పెద్దిపోయిన వెంకటరాజు(38) కొన్నేళ్ల క్రితం మచిలీపట్నం సుకర్లాబాదలో ఇల్లు కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడూ గూడూరు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గూడూరు వచ్చిన వెంకట్రాజు గూడూరు మసీదు సెంటరులో తారసపడిన గొరిపర్తి నాగేంద్రంను కూడా తన ద్విచక్రవాహనం ఎక్కించుకుని బందరు బయలుదేరాడు. రామరాజుపాలెం అడ్డరోడ్డు దాటిన తర్వాత వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో వెంకటరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ప్రైవేటు అంబులెన్స్‌లో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరాజుకు భార్య, ఇద్దరు సంతానం. నాగేంద్రం స్వల్పగాయాలతో బయట పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెనమలూరు: తాడిగడప గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతా మల్లిఖార్జునరావు(49) అరటి ఆకులు కోసి మార్కెట్‌లో విక్రయిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అరటి తోటకు వెళ్లాడు. అయితే మల్లిఖార్జునరావు అరటి తోటలో పడి పోయి ఉండటాన్ని కొమ్మునాగరాజు చూసి వెంటనే అతని కుటుంబ సభ్యులను సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడకు వద్ద వచ్చి చూడగా అప్పటికే మల్లిఖార్జునరావు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు లిఖిల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం


