కూచిపూడిలో చాగంటికి నాట్య నీరాజనాలు
కూచిపూడి(మొవ్వ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సోమవారం నాట్య క్షేత్రం కూచిపూడిలో ఘన స్వాగతం లభించింది. కోలాట భజనలు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో వేదపండితుల ఆశీర్వచనాల నడుమ శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు సోమవారం సాయంత్రం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నూతన వస్త్రాలతో సత్కరించారు. ఆలయ సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి కళా వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి చాగంటి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, ఎంపీడీవో డి.సుహాసిని, దేవాలయ పాలక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శనలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠం విద్యార్థులతో పాటు హైదరాబాద్, కాకినాడకు చెందిన కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. అలాగే చాగంటి కోటేశ్వరరావు మనుమరాలు శ్రీకరి (కాకినాడ) ప్రదర్శించిన రామాయణ శబ్దం చక్కని హావభావాలతో ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం ఉప ప్రధానాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నృత్య దర్శకత్వంలో నిర్వహించిన మోహిని భస్మాసుర నృత్య రూపకం ఆశీనులను భక్తి భావంలోకి తీసుకువెళ్లింది.
కూచిపూడిలో చాగంటికి నాట్య నీరాజనాలు


