ఇంద్ర ఏసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హనుమాన్‌జంక్షన్‌రూరల్: హనుమాన్‌జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇంద్ర ఏసీ బస్సుకు గురువారం సాయంత్రం పెనుప్రమాదం తప్పింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రహదారి నుంచి బస్టాండ్ ఇన్‌గేట్ ద్వారా లోనికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇన్‌గేట్ మార్గం పక్కనే ఉన్న పాత బస్టాండ్ రేకుల షెడ్ పైకప్పును ఇంద్ర బస్సు ఢీకొంది. ఐరన్ రేకులను గీసుకుంటూ బస్సు ముందుకు రావటంతో బస్సు, పాత బస్టాండ్ పైకప్పు దెబ్బతిన్నాయి. పాత బస్టాండ్ రేకుల పైకప్పును ఢీ కొడుతూ బస్సు ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ బస్సు కావటంతో మంటలు చెలరేగితే మరింత ముప్పు వాట్లిలేదంటూ మండిపడ్డారు. అంతేకాక బస్సు అదుపు తప్పి ఇన్‌గేట్ మార్గం నుంచి పక్కనే ఉన్న పాత బస్టాండ్ లోతట్టు ప్రాంతంలోకి బస్సు బోల్తా కొడితే పెనుప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.


