జాతి సమైఖ్యతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ సమైఖ్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచారయాత్ర డిజిటల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, జిల్లా యువజన అధికారి సుంకర రాము తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. భారత చరిత్రలో ఇంతకు ముందున్నెడూ లేని విధంగా వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి నవంబరు 25వ తేదీ వరకు యువతలో ఐక్యత దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అన్ని జిల్లాల్లో యూనిటీ మార్చ్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
మచిలీపట్నం నగరంలో కోనేరుసెంటర్ నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు మార్చ్ చేపడతామని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, మత్తు రహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఆర్సీ ఆనందకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


