తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకోండిలా
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో 1.54 లక్షల హెక్టారుల్లో వరి సాగు చేపట్టారు. అందులో 45,040 హెక్టారుల్లో వరి మోంథా తుఫాన్‌కు దెబ్బ తింది. తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకునే విధానాన్ని జిల్లాలోని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి గురువారం సూచించారు. వరి పంట పెరుగుదల దశలో వరిపైరు వర్షపునీటి ముంపునకు గురైతే పొలంలో ముుంపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. తుఫాన్‌కు పొలంలోకి వర్షపునీరు చేరినప్పుడు చీడపీడలు కూడా పంటను పీడిస్తాయి. ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ఈ తరుణంలో వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు వరిలో దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా పాముపొడ మచ్చలుగా మారతాయి. ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోతాయి. నివారణకు ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటర్లు లేక వాలిడామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేక హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు నీటిలో కలిపి దుబ్బుకు తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
గ్రామాల్లో పోస్టర్ల ద్వారా అవగాహన..
అలాగే వరిలో అగ్గి తెగులు ఉధృతికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అగ్గి తెగులు సోకినప్పుడు ముదురు ఆకులపై నూలుకుండి ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలిసిపోయి పంట ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్యాజివన్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అధిక నీటి ప్రవాహం తర్వాత దోమ ఆశించే అవకాశం ఉంది. దోమ ఉధృతి ఎక్కువైనప్పుడు నివారణకు ఇతోపెన్హాక్స్ రెండు మిల్లీలీటర్లు లేదా 1.5గ్రాములు ఎసిపేట్ లేదా 0.25 మిల్లీలీటర్లు అమిడాక్లోప్రిడ్ లేదా 0.20 గ్రాములు దయోమిదో కామ్ లేదా డైనెటో ఫ్యురాన్ 0.25 గ్రాములు లేదా బిప్రొఫ్యూజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ౖపైమెట్రోజన్ 0.6 మిల్లీలీటర్లు లేదా రెండు మిల్లీలీటర్లు బీపీఎంసీ లేదా మోనోక్రోటోఫాస్ 2.2మిల్లీలీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలాన్ని అడపా తడపా ఆరబెట్టాలని జిల్లాలోని రైతులకు జేడీఏ పద్మావతి సూచించారు. అలాగే తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల్ని ఎలా కాపాడాకోవాలనేది జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాల్లో పోస్టర్ల ద్వారా రైతులకు ఏడీఏలు, ఏవోలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కలిగిస్తున్నారని పద్మావతి పేర్కొన్నారు.
జేడీఏ పద్మావతి
తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకోండిలా


