డెప్యూటీ సీఎం పవన్ పర్యటనలో సర్పంచ్‌కు అవమానం
అవనిగడ్డ: అవనిగడ్డలో డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రథమ పౌరురాలైన సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మకు అవమానం జరిగింది. అవనిగడ్డ మండల పరిధిలోని రామకోటిపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గురువారం తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రామకోటిపురం సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మ ఫొటో ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లగా పోలీసులు ఆమెను అనుమతించలేదు. సర్పంచ్ అని చెప్పినా వినకుండా ప్రొటోకాల్‌లో మీరు లేరని ఆమెను మహిళా పోలీస్ సిబ్బంది బయటకు పంపించటం తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ కావడం వల్లనే బయటకు పంపించేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏ పదవీ లేని కొంతమంది నాయకులు మాత్రం దర్జాగా లోపల తిరగటం కొసమెరుపు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమించానని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత రాజరాజేశ్వరిపేట మణికంఠ మెడికల్ షాపు సెంటర్‌కు చెందిన యువతి బీసెంట్‌రోడ్డులోని ఓ షాపులో పని చేస్తుంది. షాపు ఎదురుగా ఉండే చెప్పుల షాపులో సాయికుమార్ పని చేసేవాడు. కొంత కాలంగా సాయికుమార్, ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. ఆ తర్వాత వారు రెండు సార్లు లైంగికంగా కలిశారు. యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. అయితే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. సాయికుమార్ తన ఇంట్లో వారితో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రస్తుతం సాయికుమార్‌కు ఫోన్ చేస్తే పెళ్లి తన కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను మోసపోయానని ఆమె గ్రహించింది. సాయికుమార్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
మంగళగిరి టౌన్: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి బాగుందంటూ..ఒకసారి ఫొటో దిగుతానని, ట్రయల్ రన్ వేస్తానని చెప్పి, బండితో పరారైన సంఘటన మంగళగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నరిశెట్టి మురారి అనే యువకుడు మంగళగిరి నగర పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. కళాశాల సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. ఈనెల 28 సాయంత్రం తన స్నేహితుడితో మంగళగిరి నగర పరిధిలోని ఓ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చాడు. సరుకులు కొనుగోలు చేసి తన వాహనం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఓ యువకుడు బుల్లెట్ బాగుందంటూ మాట కలిపాడు.
ఈ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నానని, బుల్లెట్‌పై ఫొటో దిగుతానని నమ్మబలికాడు. బైక్ మీద కూర్చుని, ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పడంతో మురారి సరేనంటూ తాళం ఇచ్చాడు. ఆ యువకుడు బుల్లెట్ స్టార్ట్ చేసి కొంతదూరం వెళ్లి అటు నుంచి అటు ఉడాయించాడు. ఎంతకూ రాకపోయే సరికి మురారి సూపర్‌మార్కెట్‌లోకి వెళ్లి మీ దగ్గర పనిచేసే వ్యక్తి బుల్లెట్ తీసుకువెళ్లాడని, తిరిగి రాలేదని చెప్పడంతో ఆ యువకుడు తమకు తెలియదంటూ చల్లగా చెప్పడంతో.. తాను మోసపోయానని గ్రహించాడు. మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో ఎంత వెతికినా నిందితుడి సమాచారం తెలియకపోవడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


