మోంథాతో వేల ఎకరాల్లో పంట నష్టం
●17 మండలాలు, 235 గ్రామాలపై మోంథా తుఫాన్ ప్రభావం
● వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌కు వివరించిన దేవినేని అవినాష్
● కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో మోంథా తుఫాను ప్రభావం 17 మండలాల్లోని 235 గ్రామాలపై చూపిందని, 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వివరించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో గురువారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దేవినేని అవినాష్ జిల్లాలో తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించి నష్టాన్ని వివరించారు. పంటలకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయని, వాటి వివరాలను తెలియజేశారు.
మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు..
అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. వరదలు, తుఫాన్ల సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పబ్లిసిటీ కాకుండా ప్రజలకు నేరుగా న్యాయం జరిగేదని, ఈ విషయాన్ని స్వయంగా ప్రజలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్ తలపెట్టిన సచివాలయం వ్యవస్థ తుఫాన్ సమయంలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిందన్నారు. నాడు– నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలు పునరావాస కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ మీడియా చానళ్లలో ఏదో చేస్తున్నారని పబ్లిసిటీ చేశారని, తుఫాన్ బాధితులకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది వరదలు కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వచ్చాయని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఏడాది దాటినా వరద బాధితులందరికీ నష్ట పరిహారం అందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ తరుఫున బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నాలు చేసిన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులు పండించిన మిర్చిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం రైతుల గోడు పట్టించుకునే నాయకుడు లేరని వాపోతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు పార్టీలు, కుల మతాలు చూడకుండా న్యాయం చేశామన్నారు. వరదలు, తుఫాన్‌లు టీడీపీ నాయకులకు ఆదాయంగా మారాయని చెప్పారు. గతేడాది వరదల సమయంలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అబద్ధపు లెక్కలు చూపారని అవినాష్ ఆరోపించారు. నష్టపోయిన ప్రజలకు మంచి చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాన్ బాధిత, కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక జెడ్పీటీసీలు, నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.


