బాధిత రైతులను ఆదుకుంటాం
కంకిపాడు: మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో గురువారం మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. వరి పొలాలను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.50 లక్షల హెక్టార్లలో వరి పంట నేలవాలిందన్నారు. ఉద్యాన పంటలు 12,500 హెక్టార్లలో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలను నివేదించారన్నారు. పంట నష్టం సర్వేను పూర్తి స్థాయిలో సమర్థంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి పంట నష్టం సర్వే, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: మోంథా తుఫాన్ ప్రభావంతో అధికంగా కురిసిన వర్షాలకు మున్నేరుతో పాటు కృష్ణానదికి వరద పోటెత్తుతుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తెలిపారు. కృష్ణానది ప్రవాహాన్ని, వరద పరిస్థితిని ఆర్డీవో కావూరి చైతన్యతో పాటు ఆమె ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం, జూపూడి వద్ద లంక గ్రా మాలకు వెళ్లే దారిలో గురువారం పరిశీలించారు. వరదల దృష్ట్యా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వరద ప్రవా హం పెరిగితే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నదీ పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రవాహంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): జాతీయ రహదారి పక్కన బందరు కాలువలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బందరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు బందరు కాలువ ఒడ్డున ఉన్న కర్మల భవన్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, బ్లూ కలర్ షర్టు, బ్లూ కలర్ నైట్ ఫ్యాంట్, బెల్టు చెప్పులు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధిత రైతులను ఆదుకుంటాం


