దివిసీమ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షిస్తా
●ఏపీ డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
●అవనిగడ్డలో అరటి తోటలు, పంట నష్టం ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షించి సీఎం చంద్రబాబుకు నివేదిక పంపుతానని ఏపీ డెప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కోడూరు శివారు కృష్ణాపురంలో తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఎదురుమొండి – గొల్లమంద రోడ్డుకు రూ.13.8 కోట్లతో నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ దివిసీమలో గురువారం పర్యటన సందర్భంగా అవనిగడ్డలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద నియోజకవర్గంలో జరిగిన మోంథా తుఫాన్ నష్టం వివరాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అద్భుతమైన సహాయక చర్యలు అందించారని ప్రశంసించారు. మేకలు తోలుకుని లంకకు వెళ్లి తుఫాన్‌లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను గుర్తించి రెస్క్యూ బృందాలు కాపాడినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 1,523 గ్రామాలు నష్టపోయాయని, 274 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నారు.
కేంద్ర సహాయం కోరుతాం
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సూపర్ శానిటేషన్ కోసం 20 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నట్లు పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులను ఆదుకుంటున్నామన్నారు. పంట నష్టం అంచనాలు సాధ్యమైనంత వేగంగా రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర సహాయం కోరుతామని చెప్పారు. నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో కీలకంగా ఉన్న ఔట్ ఫాల్ స్లూయీజ్‌ల పునర్నిర్మాణానికి నాబార్డ్ లేక ప్రత్యామ్నాయ నిధులు సమకూర్చుతామని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి, మోంథా తుఫాన్ నష్టం తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


