కూటమి ప్రభుత్వంలో రైతులకు భరోసా కరువు
పమిడిముక్కల: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు భరోసా కరువైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ తెలిపారు. మండలంలోని మేడూరు, కృష్ణాపురం, నారాయణపురం పరిధిలో నేలవాలిన వరి పంటను పార్టీ నాయకులు, రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటంతా ఆంక్షలు లేకుండా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం, 50 శాతం అని ఆంక్షలు పెట్టి పంట నమోదు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి..
రైతులు భీమనబోయిన సుబ్బారావు, వీర్ల నాగేశ్వరరావు, ముచ్చు పిచేశ్వరరావు, ముచ్చు రాంబాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చయిందని, గింజ గట్టి పడే దశలో పంటంతా నేలవాలిందని, తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గింజ గట్టిపడదని రైతులు చెప్పారు. గతంలో కోత దశలో తుఫాన్‌లు, వర్షాల వల్ల పంట దెబ్బతిన్న కొద్దిగానే నష్టపోయేవారమని, నేడు పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ గుర్విందపల్లి వంశీ, నాయకులు పోలిమెట్ల వంశీకృష్ణ, గొర్కెపూడి బుజ్జి, మర్రి బాబూరావు, ముళ్లపూడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనిల్‌కుమార్


