తుపాను రక్షణ సేవలో సచివాలయ ఉద్యోగులు
అవనిగడ్డ: సచివాలయ ఉద్యోగులు మోంథా తుపాను రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డ్యూటీలు వేయడంతో పునరావాస కేంద్రాల్లో సేవలతో పాటు పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, దెబ్బతిన్న గృహాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాత్రి వారికి భోజనం పెట్టటం దగ్గర నుంచి విశ్రాంతి తీసుకునే వరకు ప్రతి ఒక్క బాధితుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు విపత్తుల సమయంలోనూ ఈ విధంగా ఉపయోగపడటం చాలా సంతోషంగా ఉందని పలువురు తుఫాన్ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైలు నిర్వహణలో లోపాలను సకాలంలో గుర్తించి అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషిచేసిన ముగ్గురు ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డులు అందజేశారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయం నుంచి జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ మంగళవారం విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్‌గా భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మోంథా తుఫాన్ దృష్ట్యా అన్ని డివిజన్‌లలో భద్రత సంసిద్ధతపై డీఆర్‌ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందస్తు ప్రమాద నివారణ చర్యలు చేపట్టిన పలువురు ఉద్యోగులకు ఆయన అవార్డులను అందజేశారు. విజయవాడ డివిజన్‌లో రాజమండ్రికి చెందిన గూడ్స్ లోకోపైలట్ కె.నరసింహారావు, తేలప్రోలు స్టేషన్ మాస్టర్ పెదగడి శ్రీనివాసరావు, కావలిలోని ట్రాక్ మెయింటెయినర్ పి.మాధవరావులకు జీఎం అవార్డులను ప్రదానం చేసి వారిని అభినందించారు.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు విజయవాడ–సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 30 నుంచి తెలంగాణలోని జనగాం రైల్వేస్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం స్టాపేజీ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713) ఉదయం 10.14 గంటలకు జనగాం చేరుకుని, 10.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (12714) సాయంత్రం 5.19 గంటలకు జనగాం చేరుకుని 5.20 గంటలకు బయలుదేరుతుంది.


