ఆక్వాసాగులో ప్రపంచానికి రోల్ మోడల్ కావాలి
రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్
గుడివాడ టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వచ్చే 8 నెలల్లో నందివాడ క్లస్టర్‌లో ఆక్వాసాగు ప్రపంచానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. స్థానిక వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాల ఫంక్షన్ హాలులో ఆక్వా ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో గురువారం ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ఆక్వా రైతుకు గ్లోబల్ గుర్తింపు లక్ష్యంగా డిజిటల్ ట్రేసబిలిటీతో నందివాడ ముందడుగు పేరుతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం పన్ను కారణంగా రాష్ట్రంలో ఆక్వారంగంపై ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులో సుస్థిరత సాధించేలా చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఆక్వా ఎక్స్ఛేంజ్ నందివాడ మండలంలోని అరిపిరాలలో చేపట్టిన వినూత్నసాగు సందర్శించానన్నారు. ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థ 60 వేల ఎకరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వాసాగు చేయాలనుకోవడం శుభ పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్‌కుమార్, మత్యశాఖ జేడీ నాగరాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, ఏపీఎస్‌ఏడీఏ కార్పొరేషన్ డైరెక్టర్ రాజబాబు, మత్యశాఖ అధికారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.


