కనుల పండువగా ఆదిదంపతులకు దీపోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఆదిదంపతులకు దీపోత్సవ సేవ నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చనను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. లింగార్చనలో భాగంగా స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, హారతి, ప్రసాదాల పంపిణీ జరిగింది. సాయంత్రం ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. దీపోత్సవంలో భాగంగా ఆదిదంపతులకు ఊంజల్ సేవ నిర్వహించారు. పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గురువారం 30.4 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అత్యధికంగా గూడూరులో 69.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పామర్రులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పమిడిముక్కల 63.8, చల్లపల్లి 60.4, మొవ్వ 53.2, ఉయ్యూరు 41.6, మోపిదేవి 39.2, గుడ్లవల్లేరు 38.4, గుడివాడ 36.2, కంకిపాడు 33.4, ఘంటసాల 31.4, పెదపారుపూడి 30.8, కృత్తివెన్ను 26.2 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. నందివాడ 25.0 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 24.4, తోట్లవల్లూరు 22.4, కోడూరు 22.4, పెనమలూరు 21.8, మచిలీపట్నం సౌత్, నార్త్ 21.6, అవనిగడ్డ 18.6, నాగాయలంక 17.6, బంటుమిల్లి 16.4, బాపులపాడు 14.6, పెడన 14.6, గన్నవరం 12.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.


