లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు
ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసుస్టేషన్ నుంచి నిందితుడిని ముసుగు తొలగించి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి శ్రీహరి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడు చాన్‌బాషాను నెల్లూరు జైలుకు తరలించారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. ఉయ్యూరులోని కాపుల రామాలయం ప్రాంతంలో షేక్ చాన్‌బాషా నివాసం ఉంటున్నాడు. గ్యాస్‌స్టవ్‌లు రిపేర్లు చేస్తూ తాపీ కార్మికుడుగా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దకు రోజూ ఆడుకునేందుకు వచ్చే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఆశ చూపి పైశాచికానందం పొందుతున్నాడు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఆయన ఇంటికి వచ్చిన బాలిక పెద్దగా కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో దారుణం వెలుగు చూసింది. నిందితుడు బాలికకు వరుసకు మామయ్యే. ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించటంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామారావు వేగంగా దర్యాప్తు చేపట్టి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
కోడూరు: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య గురువారం తెలిపిన వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ పరిధిలోని నాల్గో వార్డులో సానంగుల నాంచారయ్య (60) తనకున్న పూరి పాకలో ఒంటరిగా జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం నాంచారయ్య ఇంట్లో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. విద్యుత్ ఘాతం దాటికి నాంచారయ్య శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతురాలి కుమార్తె తన్నీరు రంగమ్మ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
పామర్రు: చల్లపల్లిరోడ్డులోని నాగులేరు కాలువ వంతెన కింద చెట్టు కొమ్మకు చిక్కుకున్న మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. మృతుడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేవని కుడి భజంపై మాత్రం శంఖు ఆకారం గల పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని పేర్కొన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నంబరు 08674 253 333కు సమాచారం అందించాలని కోరారు.
మైలవరం:మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న నిర్వహించాల్సిన జాబ్‌మేళా కార్యక్రమం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా రద్దు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. తిరిగి ఈ నెల 31 శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


