కూటమిలో ముసలం మొదలు!
●అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవి
ఇవ్వకపోవడంతో ప్రమాణస్వీకారాన్ని
బహిష్కరించిన జనసేన నేత
వంపుగడవల చౌదరి
● తాను ఎస్సీననే టీడీపీ నాయకులు వివక్ష
మచిలీపట్నంటౌన్: కూటమిలో ముసలం మొదలైంది. అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సర కార్యక్రమం దీనికి వేదికై ంది. ఇటీవల అర్బన్ బ్యాంక్‌కు చైర్మన్‌తో సహా 9 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం బ్యాంక్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు కూటమి శ్రేణులు బ్యాంకు వద్ద వర్షంలో సైతం పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రమాణ స్వీకారోత్సవ సభ వద్ద టీడీపీ, సనసేన నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న వంపుగడవల చౌదరికి పాలకవర్గంలో చోటు లభించింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత చౌదరికి ఉపాధ్యక్ష పదవి వచ్చిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఆయనకు చెప్పారు. ఆ పార్టీ శ్రేణులు ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో చౌదరి వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా టీడీపీకి చెందిన దిలీప్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్‌గా తనతో ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన చౌదరికి భంగపాటు ఎదురయింది. దీంతో చౌదరితో పాటు జనసేన నాయకులు ఈ విషయమై అక్కడున్న టీడీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ రామకృష్ణ కార్యక్రమానికి హాజరు కాలేదని, వారిద్దరితో చర్చించిన తర్వాతనే వైస్ చైర్మన్ పదవి ఎవరికి అనేది నిర్ధారించి ప్రమాణస్వీకారం చేయిస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. దీనికి విభేదించిన చౌదరి ప్రమాణస్వీకారం బహిష్కరించి అక్కడి నుంచి వచ్చేశారు. అనంతరం చౌదరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పొత్తు ధర్మం పాటించకుండా తాను కేవలం ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిననే టీడీపీ నాయకులు సాకులు చెబుతూ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ విధంగా నమ్మించి అవమానపరిచిన టీడీపీ వారిని ఏమనాలో అర్థం కావట్లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిగిలిన డైరెక్టర్లు వేము కోటేశ్వరరావు, నూకల రమాదేవి, జి.అరుణ్ కుమారి, పోతాబత్తుల పాండురంగారావు, సూరిశెట్టి హరికృష్ణ, బొర్రా శ్రీనివాస్, గున్నం నాగరాజన్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.


