గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ లక్ష్మీశా
తిరువూరు:జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం, ఏకొండూరు గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న దుంపజాతులు, తీగజాతులు, ఆకుకూరలు, కాయగూరలను పరిశీలించారు. తెగుళ్ళ నివారణకు ద్రవ జీవామృతం, ఘన జీవామృతాలను వాడాలని, రసాయన మందులను వినియోగించవద్దని సూచించారు. గురుకుల విద్యార్థులకు పోషక విలువలున్న కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యంలో విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్న పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంపలను కలెక్టర్ పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఏకొండూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజరు శంకర్ నాయక్, ఏకొండూరు తహసీల్దారు లక్ష్మి, డీఎంఎం నాగేశ్వరమ్మ, తిరువూరు ఏడీఏ రంగారావు, వ్యవసాయాధికారి పి.పద్మ పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మచిలీపట్నం–చర్లపల్లి (07642) రైలు, 26న చర్లపల్లి–మచిలీపట్నం (07641) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. రెండు మార్గాల్లో ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుందన్నారు.


